Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!

Yuvraj Singh Team

Yuvraj Singh Team

టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2027 వన్డే వరల్డ్‌కప్‌ కోసం తన డ్రీమ్ భారత జట్టును ప్రకటించాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లతో యువరాజ్ తన జట్టును ఎంచుకున్నాడు. యువీ తన జట్టులో సీనియర్ స్టార్‌ ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం యువరాజ్ జట్టుపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

యువరాజ్ సింగ్ తన జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి చోటు కల్పించిన యువరాజ్.. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో నిలకడ ఉండేలా ఈ కాంబినేషన్‌ను ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం వీరికి ఉందని యువీ అభిప్రాయపడ్డాడు.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించగా.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను యువరాజ్ సింగ్ ఎంపిక చేశాడు. వికెట్‌కీపర్‌గా రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చిన యువీ.. అతడిని జట్టులో కీలక సభ్యుడిగా పరిగణించాడు. అయితే ఈ జట్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2027 ప్రపంచకప్ సమయానికి యువ జట్టును నిర్మించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
శ్రేయస్ అయ్యర్
రిషభ్ పంత్
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
అర్ష్‌దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా