Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్‌!

Yashasvi Jaiswal Icc

Yashasvi Jaiswal Icc

Yashasvi Jaiswal Fined 25 Percent match fees by ICC: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు చోటుచేసుకున్న వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. మైదానంలో గొడవ పడిన టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండోకు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నాట్లు ఐసీసీ పేర్కొంది. అంతేకాదు ఈ ఇద్దరి క్రమశిక్షణా రికార్డుల్లో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా చేర్చింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లోని 17వ ఓవర్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ ఔటయ్యాడు. అనంతరం లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. యశస్వి డగౌట్ వైపు వెళుతున్న క్రమంలో అసిత ఫెర్నాండో ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫెర్నాండో తన తలను జైస్వాల్‌ వైపు కదపగా.. జైస్వాల్‌ కూడా ముందుకు వంగాడు. దాంతో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదిటిని తాకింది. వెంటనే లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వాతో పాటు ఇతర ఆటగాళ్లు వచ్చి.. ఇద్దరినీ విడదీయడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ ఘటనను ఐసీసీ కోడ్‌లోని ఆర్టికల్‌ 2.12 కింద పరిగణించారు. అంతర్జాతీయ మ్యాచ్‌ సమయంలో ఆటగాడు, సిబ్బంది, అంపైర్‌, మ్యాచ్‌ రిఫరీ లేదా ఇతర వ్యక్తితో అనుచిత వ్యాఖ్యలు చేయడం, శారీరక స్పర్శకు దిగడం విరుద్ధం. ఈ ఉల్లంఘనకు యశస్వి జైస్వాల్‌, అసిత ఫెర్నాండో ఇద్దరూ అంగీకరించారు. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించిన శిక్షలను ఇద్దరూ అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండా పోయింది. ఈ ఘటనపై మైదాన అంపైర్లు అహ్సాన్ రజా, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్‌తో పాటు థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్‌, ఫోర్త్ అంపైర్ ప్రగీత్ రాంబుక్వెల్లా అభియోగాన్ని మోపారు.

యశస్వి జైస్వాల్‌, అసిత ఫెర్నాండోల మొదటి తప్పిదంగా పరిగణించారు. ఈ ఇద్దరూ గత 24 నెలల్లో ఎలాంటి క్రమశిక్షణా ఉల్లంఘనలు లేవు. లెవల్‌-1 ఉల్లంఘనలకు కనీసంగా అధికారిక హెచ్చరిక నుంచి గరిష్ఠంగా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లు కూడా ఇవ్వవచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల వ్యవధిలో ఒక ఆటగాడి డీమెరిట్‌ పాయింట్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువైతే అవి సస్పెన్షన్‌ పాయింట్లుగా మారుతాయి. రెండు సస్పెన్షన్‌ పాయింట్లు వస్తే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20 మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంటుంది. డీమెరిట్‌ పాయింట్లు విధించిన తేదీ నుంచి 24 నెలల పాటు రికార్డులో కొనసాగి ఆ తర్వాత తొలగించబడతాయి.