Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు వారు లేఖ రాశారు.రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు నాలుగు డిమాండ్లు చేశారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. సీనియర్ రెజ్లర్లకు కాంట్రాక్టుల ప్రకారం వేతనాలు అందట్లేదు. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ ఫోగాట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ చాలా హింసించాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. నేషనల్ క్యాంప్‌లో అర్హత లేని కోచ్‌లు, ఇతర సిబ్బందిని డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ నియమించాడు. వాళ్లంతా ఆయన అనుచరులే” అని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు.
Read Also: Air India Incident: పీ గేట్ వివాదం.. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా..పైలెట్‌పై చర్యలు
ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం ముందు రెజ్లర్లు నాలుగు డిమాండ్లను ఉంచారు. అవి..
1. లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేయాలి.
2. డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ వెంటనే రాజీనామా చేయాలి.
3. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలి.
4. డబ్ల్యూఎఫ్‌ఐ సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లతో మాట్లాడి ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.
కాగా తనపై వస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అంటూ.. ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాను ఎవరి దయ మీద ఈ పదవి చేపట్టలేదని, ఇప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సాయంత్రం మీడియా ద్వారా అన్ని విషయాలు బయటపెడతానని వెల్లడించారు.