ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్ సాధించింది. తన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో నందిని కూడా చేరింది.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కనికా అహుజా, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్‌లను అవుట్ చేయడం ద్వారా నందిని శర్మ ఈ ఘనతను సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే హ్యాట్రిక్ సాధించారు. ఈ జాబితాలో ఇస్సీ వాంగ్ (ముంబై ఇండియన్స్), గ్రేస్ హారిస్ (యూపీ వారియర్స్), దీప్తి శర్మ (యూపీ వారియర్స్) ఉన్నారు. డబ్ల్యూపీఎల్ 2026లో హ్యాట్రిక్ సాధించిన నందిని గురించి క్రికెట్ అభిమానులు వెతుకుతున్నారు.
నందిని శర్మ చండీగఢ్‌కు చెందిన క్రికెటర్. దేశీయ టీ20 క్రికెట్‌లో ఆమె ఫాస్ట్ బౌలింగ్ అందరినీ ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 20న జన్మించిన నందిని దేశీయ క్రికెట్‌లో చండీగఢ్ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. నార్త్ జోన్ మహిళా జట్టు తరపున ఇంటర్-జోనల్ మ్యాచ్‌లు కూడా ఆడింది. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ (2025) టోర్నమెంట్లలో మెరిసింది. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్ధ్యం ఆమె సొంతం. 2026 వేలంలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో నందినికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి మొదటి అవకాశం లభించింది. డబ్ల్యూపీఎల్ హ్యాట్రిక్ ఆమె కెరీర్‌లో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.
