Site icon NTV Telugu

IND Vs WI: కోహ్లీ.. రోహిత్.. ఈరోజు చరిత్ర సృష్టించేది ఎవరో?

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద ఉంది. ఇప్పటివ‌ర‌కు అతడు 112 మ్యాచ్‌లు ఆడి 3,299 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, 20 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

మార్టిన్ గప్తిల్ రికార్డును అధిగమించడానికి ఈరోజు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 56 పరుగులు చేయాల్సి ఉంటుంది. కోహ్లీ ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడి 3,244 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు గప్తిల్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాలంటే 63 పరుగులు చేయాలి. రోహిత్ ఇప్పటివరకు 120 మ్యాచ్‌లు ఆడి 3,237 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లో ఎవ‌రో ఒక‌రు ల‌క్ష్యాన్ని చేరుకుంటే గప్తిల్ రికార్డు బద్దలు అవుతుంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version