NTV Telugu Site icon

Virat Kohli: రన్‌ మెషిన్‌కు ఏమైంది..?

టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌ మెషిన్‌గా పేరుపొందిన విరాట్‌ కోహ్లీ ఇప్పుడు క్రికెట్‌ ప్రేమికులను నిరాశపరుస్తున్నాడు.. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్‌ కోహ్లి అవుటైన తీరు ఇది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఎలా అవుటయ్యాడో.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సేమ్ టు సేమ్. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో అవుటైతే.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. వందో టెస్టులో 45 పరుగులు చేసిన విరాట్‌.. ఇక బెంగళూరు టెస్టులో రాణిస్తాడని అభిమానులు ఆశించారు. పైగా RCB కెప్టెన్‌గా తన సొంత మైదానంలో చెలరేగిపోతాడని కోహ్లి ఫ్యాన్స్‌ ఆశించారు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ అవుటైన తీరు అభిమానుల్ని నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 23, సెకండ్ ఇన్నింగ్స్‌లో 13 ప‌రుగులు మాత్రమే చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 50 పరుగులు కూడా చేయలేకపోయాడు విరాట్‌.

Read Also: TS RTC: ‘ఆర్ఆర్ఆర్‌’నీ వదలని సజ్జనార్.. ఫిదా కావాల్సిందే..

కింగ్‌ కోహ్లి పరుగులు చేయడానికి.. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొట్టిన కోహ్లికి.. ఇప్పుడు శతకం అనేది అందని ద్రాక్షగా మారింది. అంత‌ర్జాతీయ క్రికెట్లో కోహ్లీ చివ‌రిసారిగా 2019 న‌వంబ‌ర్‌లో సెంచ‌రీ సాధించాడు. అంటే దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. కోహ్లి బ్యాటింగ్‌లో ఎందుకు వరుసగా ఫ్లాప్‌ అవుతున్నాడని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతమెంతో ఘనం.. ఇప్పుడు మాత్రం సతమతంలా తయారైంది టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పరిస్థితి. దూకుడు మంచిదే.. కానీ అన్ని సందర్భాల్లో అది పనికి రాదు. రన్స్‌ చేస్తున్నంత కాలం.. ఎలా ఉన్నా నడుస్తుంది. అదే బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయి.. ఫామ్‌ కోల్పోతే.. ఒక్కో పరుగు చేయడం గగనమవుతుంది. సెంచరీల సంగతి తర్వాత.. కనీసం హాఫ్‌ సెంచరీలు కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు కోహ్లిది అదే సిట్యువేషన్‌. ఆది నుంచి వివాదాలతో.. అర్థాంతరంగా మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతల నుంచి అవమానకర రీతిలో తప్పుకున్నాడు. ఏకంగా బీసీసీఐతోనే గిల్లికజ్జాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు పరుగులు చేయలేక కిందా మీద పడుతున్నాడు.