NTV Telugu Site icon

T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి

West Indies

West Indies

T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు నిండా హిట్టర్లే ఉంటారు. కానీ నిలకడలేమితో ఆ జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిగ్గజ జట్టుగా ప్రశంసలు పొందిన ఆ జట్టు నేడు ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ జట్టు సగర్వంగా అందుకుంది. 2012, 2016లో పొట్టి ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు.

Read Also: ఈ స్టార్ హీరోయిన్ దొంగతనాలు చేసేదా? అబద్ధాలు చెప్పేదా?

అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ హోబర్ట్ వేదికగా ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్ దశను దాటితేనే వెస్టిండీస్ జట్టు సూపర్ 12లోకి అడుగు పెట్టగలుగుతుంది. వెస్టిండీస్ జట్టుపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ.. అద్భుతాలు జరగబోవనే గ్యారంటీ లేదు. క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. విండీస్ బ్యాటింగ్ గాడిన పడితే ఆ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా 2016 ప్రపంచకప్‌ ఫైనల్‌లో చివరి ఓవర్‌లో వరుసగా సిక్సర్లు బాది ఇంగ్లండ్‌కు పరాభవాన్ని మిగిల్చింది. నికోలస్ పూరన్ నాయకత్వంలో ఆడుతున్న విండీస్ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఎక్కడి వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాలి.