West Indies Lost First Qualifier Match Against Scotland In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో ఎవ్వరూ ఊహించని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద టీమ్స్‌ని చిన్న జట్లు గడగడలాడించేస్తున్నాయి. క్వాలిఫయర్ రౌండ్లో ఆల్రెడీ శ్రీలంకను నమీబియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే! ఆసియా కప్ గెలిచిన లంక జట్టు.. క్వాలిఫయర్‌లో సునాయాసంగా నెట్టుకొస్తుందని భావిస్తే, అందుకు భిన్నంగా నమీబియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు తాజాగా వెస్టిండీస్ పరిస్థితి కూడా అదే! విధ్వంసకర బ్యాటర్లు కలిగిన ఈ కరీబియన్ జట్టు.. స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో.. సూపర్-12 చోటు దక్కించుకోవడం కోసం, మిగిలిన రెండు మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి విండీస్‌కి నెలకొంది.
తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సే (66) అర్ధశతకంతో చెలరేగగా.. మైకెల్ జోన్స్ (20) మ్యాక్‌లియోడ్ (23) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, హోల్డర్ 2, ఒడియన్ స్మిత్ ఒక వికెట్ తీశారు. ఇక 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, 118 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్ (38) మినహాయిస్తే.. ఏ ఒక్కరూ సత్తా చాటలేకపోయారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. మిగతా బ్యాటర్లలో కైల్ మేయర్స్ 20, ఇవిన్ లూయిస్ 14, బ్రాండన్ కింగ్ 17 పరుగులు చేశారంతే! స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ జట్టు వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో విండీస్ 118 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. 42 పరుగుల తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించింది.
శ్రీలంక, నమీబియా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్(44), జేజే స్మిత్ (31) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నమీబియా అంత స్కోరు చేయగలిగింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 108 పరుగులకే కుప్పకూలింది. శనక (29), రాజపక్స (20) మాత్రమే పర్వాలేదనిపిస్తే.. మిగతా బ్యాటర్లు వెనువెంటనే పెవిలియన్ చేరారు.