NTV Telugu Site icon

Wasim Akram: ఆ క్రికెటర్ మనిషి కాదు.. వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్

Wasim On Suryakumar

Wasim On Suryakumar

Wasim Akram Praises Suryakumar Yadav: ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. పిచ్ ఎలా ఉంది.. ప్రత్యర్థులు ఎవరు.. అనే విషయాలను పట్టించుకోకుండా ప్రతి మ్యాచ్‌లోనూ విరుచుకుపడుతున్నాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో మూడు అర్థశతకాల సహాయంతో 193.96 స్ట్రైక్ రేట్‌తో 225 పరుగులు సాధించాడు. విశేషం ఏమిటంటే.. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో షాట్లను బాదుతున్నాడు. ఆల్రెడీ 360 డిగ్రీ ఆటగాడని ముద్ర పడగా.. దానికి పూర్తి న్యాయం చేకూరిస్తూ, అన్ని దిక్కులా బౌండరీలు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతనిపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.

ఇప్పుడు తాజాగా సూర్యపై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించారు. అతడు ఈ గ్రహానికి చెందిన మనిషి కాదని, వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్ అని తాను అనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సూర్య చాలా డిఫరెంట్ అని, 2022లో టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ సూర్య మాత్రమేనని కొనియాడారు. ఒక జింబాబ్వేపై మాత్రమే కాదు.. ప్రపంచంలోని టాప్ బౌలింగ్ ఎటాక్స్‌పై సూర్య ఆడిన ఆట ఒక ట్రీట్ అని కితాబిచ్చారు. అతని టాలెంట్ అమోఘమని.. ఏ మాత్రం భయం లేకుండా మైదానంలో విజృంభిస్తున్నాడని అన్నారు. తన శరీరానికి బంతి తగిలినా.. దాన్ని లెక్కచేయని తత్వం అతనిదన్నారు. సూర్య ఆటను వీక్షించడం.. తనకెంతో ఇష్టమని చెప్పారు.

ఇదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన మరో మాజీ ఆటగాడు వకార్ యూనిస్ కూడా సూర్యని పొగడ్తలతో ముంచెత్తారు. సూర్యకు బౌలింగ్ వేయడం కష్టమని.. అసలు బౌలర్ ఎక్కడ బంతి విసరాలో కూడా అర్థం కాని రీతిలో అతడు ఆడుతున్నాడని చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో జరగబోయే మరో రెండు మ్యాచుల్లో.. సూర్య ఇదే ఆటతీరు కొనసాగిస్తే, భారత్ టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.