Site icon NTV Telugu

Virat Kohli-Vizag: విశాఖ అంటేనే ఊపొస్తుందా?.. విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే పిచ్చెక్కడం పక్కా!

Virat Kohli Vizag

Virat Kohli Vizag

విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం చాలా మంది టీమిండియా క్రికెటర్లకు కలిసొచ్చింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 148 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఇక్కడే. ఈ ఇన్నింగ్స్‌తోనే జులపాల ధోనీని క్రికెట్ ప్రపంచం గుర్తించింది. సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా వైజాగ్‌ మైదానం బాగా కలిసొచ్చింది. విశాఖ మైదానంలో జరిగిన వన్డేల్లో కింగ్ భారీగా పరుగులు చేశారు. అంతలా అంటే.. విశాఖ అంటేనే కోహ్లీకి ఊపోస్తుందా? అని ఫాన్స్ అనుకునేలా చెలరేగాడు. వైజాగ్‌లో కింగ్ కోహ్లీ గణాంకాలను ఓసారి చూద్దాం.

వైజాగ్‌లో విరాట్ కోహ్లీ ఎనమిది వన్డేలు ఆడగా ఒక మ్యాచ్‌లో మాత్రమే విఫలమయ్యాడు. విశాఖలో మూడు సెంచరీలు చేసిన విరాట్.. మరో మూడు అర్ధ శతకాలు బాదాడు. 118, 117, 99, 65, 157 నాటౌట్, 0, 31, 65 నాటౌట్.. ఇవి కోహ్లీ వైజాగ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 103.49 స్ట్రైక్ రేట్, 108.66 సగటుతో 652 పరుగులు చేశాడు. వన్డేల్లో ఏ వేదికలోనూ ఏ ఆటగాడు కూడా ఇంత ఎక్కువ సగటుతో ఇన్ని పరుగులు చేయలేదు. వైజాగ్‌లో కోహ్లీ గణాంకాలు చూస్తే సగటు అభిమానికి పిచ్చెక్కడం పక్కా. మన విశాఖలో కోహ్లీకి అద్భుత రికార్డు ఉండడంతో తెలుగు ఫాన్స్ ఆనందపడిపోతున్నారు.

Also Read: Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. రెండు శతకాలు, ఓ అర్ధ శతకం బాదాడు. రాంచిలో 135, రాయపూర్‌లో 102, విశాఖలో 65 రన్స్ చేశాడు. సిరీస్‌లో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. విశాఖలో భారత జట్టుకు కూడా మంచి రికార్డు ఉంది. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడగా.. 8 మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఒక వన్డే మ్యాచ్ టై అయింది.

Exit mobile version