Site icon NTV Telugu

Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కోహ్లీ.. కెరీర్‌లోనే తొలిసారి

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం తనదైన శైలిలో అద్భుత ఫామ్‌తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కెరీర్‌లో ఎన్నో రికార్డులకు రారాజుగా మారిన అతడు తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గత ఏడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టగా తొలిసారి కోహ్లీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం ముగ్గురు ఆటగాళ్లు అక్టోబర్ నెల ఐసీసీ అవార్డు కోసం పోటీ పడ్డారు. విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజాను ఐసీసీ నామినేట్ చేసింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు మాత్రం కోహ్లీకే ఈ అవార్డును కట్టబెట్టారు.

కాగా మూడేళ్లకు పైగా ఫామ్ లేమితో సతమతం అయిన కోహ్లీ సెప్టెంబర్ నెలలో జరిగిన ఆసియా కప్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగాడు. అటు టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరు నెలలో కోహ్లీ రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగులు చేసి తానేంటో మరోమారు క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు.

Read Also: Dead Body On Bike: దారుణం.. బైక్‌పై కుమార్తె మృతదేహంతో తల్లిదండ్రులు

కాగా ఈ అవార్డు కోసం విజేతను ప్రతినెలా ఐసీసీ మూడు ఫార్మాట్లలోని ఆటతీరు ఆధారంగా ఎంపిక చేస్తుంది. ముగ్గురు నామినీలను ఆన్ ఫీల్డ్ పనితీరు, నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ తంతు ప్రతినెలా మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ సభ్యులు ఉంటారు.

Exit mobile version