NTV Telugu Site icon

Virat Kohli: అక్కడ డబుల్ సెంచరీ.. ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్

Virat Kohli 200m

Virat Kohli 200m

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్‌లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్‌లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్‌తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయింగ్‌లో 200 మిలియన్ మార్క్‌ని దాటేశాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ.. ‘‘200మిలియన్ స్ట్రాంగ్. ఇంత భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టాలో అత్యధిక పాలోయింగ్ కలిగిన క్రీడాకారుల్లో తొలి రెండు స్థానాల్లో ఫుట్ బాల్ దిగ్గజాలైన క్రిస్టియానో ​​రొనాల్డో (450 మిలియన్ల ఫాలోవర్లు), లియోనెల్ మెస్సీ (333 మిలయన్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఆ ఇద్దరి తర్వాత హయ్యస్ట్ ఫాలోవర్స్ గల క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

కాగా.. గతేడాదిలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వైఫల్యం తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే, అనంతరం టెస్టులకు కూడా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. కెప్టెన్సీ భారం మోయలేక తాను తన ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నానని, అందుకే నాయకత్వ బాధ్యతలకు స్వస్తి పలుకుతున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.