Virat Kohli Returns to RCB Ahead of IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రావడమే ఆలస్యం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆటగాళ్లతో కలసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. కింగ్ రాకతో ఆర్సీబీలో కొత్త ఉత్సాహం వచ్చింది. విరాట్ ఇప్పుడు ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్‌కు సిద్ధమవుతున్నాడు. గత సీజన్‌లో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
గత సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కనబర్చాడు. మొత్తం 657 పరుగులు సాధించి.. 144.71 స్ట్రైక్ రేట్, 54.75 సగటుతో ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు. కింగ్ నిలకడైన ప్రదర్శన ఆర్సీబీకి 18 ఏళ్ల టైటిల్ దాహాన్ని తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ విజయంతో ఆర్సీబీ కొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు నాయకత్వంలో రాజత్ పటిదార్ కీలక పాత్ర పోషించాడు. టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి విజయం సాధించడం పెద్ద సవాల్‌గా మారింది. ఈసారి కూడా కోహ్లీ ప్రదర్శనపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.
ఇటీవల విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను వన్డేలు, ఐపీఎల్‌పైనే దృష్టి సారిస్తున్నాడు. దీంతో ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత పెరిగింది. 37 ఏళ్ల వయస్సులోనూ కోహ్లీ తన క్లాస్‌ను కొనసాగిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్‌గా నిలుస్తున్నాడు. ఇటీవల వన్డేల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దక్షిణాఫ్రికాపై 135, 102, 65 నాటౌట్ పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌పై 93, 124 పరుగులు చేసి తన స్థిరత్వాన్ని చాటాడు.
Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పటికే 267 మ్యాచ్‌ల్లో 8,661 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఎనిమిది సెంచరీలతో రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ సీజన్‌లో కోహ్లీ ఎలా రాణిస్తాడో, ఆర్సీబీ టైటిల్‌ను కాపాడుకుంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
