NTV Telugu Site icon

Virat Kohli: కప్పు చల్ గయా.. రికార్డులు మాత్రం ఆగయా..!!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చినట్లుంది టీమిండియా పరిస్థితి. 9 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా అభిమానులను నిరాశపరుస్తున్న భారత జట్టు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులు మాత్రం సాధిస్తూ సంతోషపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా ఇంటి దారి పట్టింది. కానీ ఈ సెమీస్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగత రికార్డుల పంట పండించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 ఫోర్లు కొట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో శ్రీలంక ఆటగాళ్లు జయవర్ధనే, దిల్షాన్ కూడా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి ఫోర్లు కూడా పూర్తి చేశాడు కోహ్లీ. సెమీస్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ ఈ ప్రపంచకప్‌లో నాలుగోది కాగా మరెవరూ ఈ రికార్డు సాధించలేదు.

ఈ ప్రపంచకప్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇంగ్లండ్‌పై 50, పాకిస్థాన్‌పై 82, నెదర్లాండ్స్‌పై 62, బంగ్లాదేశ్‌పై 64 పరుగులను విరాట్ కోహ్లీ చేశాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లలో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లలో 1100 పరుగులు కూడా కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. అటు అడిలైడ్ ఓవల్ వేదికగా అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్‌లో 4,000 పరుగులను పూర్తి చేసుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తన పేరును లిఖించుకున్నాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

Read Also: Rashmika Mandanna: రష్మికకు కాంతార కు సంబంధం ఏంటి..?

కాగా గత ఏడాది ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టిన భారత జట్టు.. ఈ ఏడాది సెమీఫైనల్ వరకు వెళ్లింది. టీమిండియా సెమీస్ చేరడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఇన్నింగ్సులు ఆడటం వల్ల టీమిండియా సెమీస్ వరకు వెళ్లిందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో టీ20లకు కోహ్లీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వస్తుండటంతో అభిమానులు మాత్రం అతడికి మద్దతు పలుకుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అత్యధిక ఫోర్లు, టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు.. ఇలా ఎన్నో రికార్డులు ఉన్న కోహ్లీ రిటైర్ అవ్వకూడదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.