2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతటి గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్‌లో కొనసాగుతుండటం గమనార్హం. మిగతా క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇటీవల శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లో కోహ్లీ ఒక్కడే మిగిలాడు.
ఆనాడు ప్రపంచకప్ గెలిచే సమయానికి జట్టులో ఉన్న కోహ్లీ వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యువరాజ్ క్యాన్సర్ బారిన పడి అనూహ్యంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
