NTV Telugu Site icon

Virat Kohli: అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు

Virat Kohli Rare Record

Virat Kohli Rare Record

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అంత ఆశాజనకంగా రాణించలేదనే చెప్పుకోవాలి. మొదట్నుంచీ అతడు నిరాశపరుస్తూనే వచ్చాడు. మధ్యలో ఓసారి అర్థశతకం సాధించాడు కానీ, అది వింటేజ్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే కాదు. మరీ నిదానంగా రాణించడంతో, క్రికెట్ ప్రియులకు అది అంత కిక్ ఇవ్వలేదు. కానీ, నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఉగ్రరూపం దాల్చాడు. ఏ కోహ్లీని అయితే క్రీడాభిమానులు చూడాలనుకున్నారో, ఆ కోహ్లీ విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున ఏడు (7) వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్‌గా రికార్డులకెక్కాడు. కోహ్లీ సాధించిన ఏడు వేల పరుగుల్లో 6,600 పరుగులు ఐపీఎల్‌లో రాగా.. మిగతా రన్స్ చాంపియన్స్ లీగ్‌లో సాధించినవి. అయితే, ఈ లీగ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 73 పరుగులు ఈ సీజన్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ సీజన్ మొత్తంలో అతడు చేసిన అర్థశతకాలు రెండే! ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో, బెంగళూరు ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. అయితే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలవాలి. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే.. రన్ రేట్ కారణంగా బెంగళూరు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.