Site icon NTV Telugu

Virat Kohli Test Comeback: టెస్టుల్లోకి పునరాగమనం.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Test Comeback

Virat Kohli Test Comeback

Virat Kohli Confirms No Return to Test Cricket: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరలా టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను భారత్ 0-2తో వైట్‌వాష్‌ అయిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై వేటు వేయాలని మాజీలు, ఫాన్స్ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీని మళ్లీ టెస్టుల్లో ఆడించాలని బీసీసీఐకి టీమిండియా అభిమానులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకోవాలని విరాట్‌ను బీసీసీఐ అడిగినట్లు నెట్టింట జోరుగా చర్చ సాగింది.

మళ్లీ టెస్టుల్లోకి పునరాగమనం అంటూ వస్తున్న వార్తలపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే అనంతరం విరాట్ మాట్లాడుతూ.. టెస్టుల్లో మరలా ఆడేది లేదని స్పష్టం చేశాడు. తొలి వన్డేలో కింగ్ సెంచరీతో చెలరేగాడు. 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 135 రన్స్ చేశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్‌ను ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా వ్యాఖ్యాత నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ‘భవిష్యత్తులోనూ ఒకే ఫార్మాట్‌లో ఆడతారా?, మళ్లీ పునరాలోచన చేసే అవకాశం ఉందా?’ అని అడిగాడు. ‘నేను ఒకే ఫార్మాట్‌లోనే ఆడతా. నా నిర్ణయం ఎప్పుడూ అలాగే ఉంటుంది’ అని కింగ్ స్పష్టం చేశాడు. దాంతో ఇప్పటి వరకు సాగిన ప్రచారానికి చెక్‌ పడింది.

మరోవైపు విరాట్ కోహ్లీ టెస్టు పునరాగమనం వార్తలపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్లే అని పేర్కొంది. ఆదివారం ఐ జాతీయ మీడియాతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్లే. టెస్టు పునరాగమనం గురించి కోహ్లీతో మేము సంప్రదింపులు జరపలేదు. దయచేసి అనవసరమైన వాటిని ప్రచారం చేయొద్దు’ అని కోరారు. 2025 మే 12న విరాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Exit mobile version