Site icon NTV Telugu

Team India: విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్.. ఆసీస్‌తో మ్యాచ్ కోసమేనా?

Virat Kohli

Virat Kohli

Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ నుంచి బయటకు వచ్చింది. ముఖ్యంగా ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. జట్టులో దీపక్ హుడా ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ వినియోగించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.

Read Also:Live: టీచర్ కోసం ట్రైన్ ఆపేసిన స్టూడెంట్స్

ఈ నేపథ్యంలో త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలవాలంటే జట్టులో పార్ట్ టైమ్ బౌలర్లు కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సచిన్, గంగూలీ, సెహ్వాగ్, రైనా, యువరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లు పార్ట్ టైమ్ బౌలింగ్‌తో జట్టుకు సహాయపడేవాళ్లు. ప్రస్తుతం టాప్-6లో పార్ట్ టైమ్ బౌలింగ్ వేసే ఆటగాళ్లు లేకపోవడం టీమిండియాకు మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో బౌలింగ్‌లో తళుక్కుమనే విరాట్ కోహ్లీ తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం టీమిండియాకు శుభవార్త అనే భావించొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కోహ్లీ అరుదుగా బౌలింగ్ చేస్తుంటాడు. కాగా జట్టులో షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, సిరాజ్ లాంటి బౌలర్లు లేకపోవడంతో తానున్నానంటూ కోహ్లీ అభయహస్తం ఇస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version