Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!

  • వైభవ్ సూర్యవంశీపై క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం
  • వైభవ్ ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు
  • భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు
  • అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Clive Lloyd’s Advice to Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్.. భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న వివాదంపై బుడ్డోడికి ఓ కీలక సూచన చేశాడు. వైభవ్ శ్రీలంక ఆటగాళ్లతో ధీటుగా స్పందించడం కంటే.. అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు:

రెవ్‌స్పోర్ట్జ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు పలకడం కాస్త కష్టమే. కానీ అతను చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు. వైభవ్ బంతిని ఎంతో సులభంగా బౌండరీ, సిక్సర్లకు తరలిస్తాడు. అతను స్లాగర్ కాదు.. టెక్నిక్‌తో, టైమింగ్‌తో భారీ షాట్లు ఆడతాడు. వైభవ్ ఆటను మార్చే ప్రయత్నం చేయకుండా అలాగే కొనసాగనివ్వాలి. భవిష్యత్తులో అతడిని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. పెద్ద స్టార్ అవుతాడు’ అని ప్రశంసించాడు.

×
×
Ad

లంక ఆటగాడిని తోసేసిన వైభవ్:

ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అంతకుముందే లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన అతడు.. ఫైనల్లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్-ఏ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే లీగ్ దశలో శ్రీలంక-ఏతో జరిగిన ఒక మ్యాచ్‌లో వైభవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి ఆటగాడు స్లెడ్జింగ్ చేయడంతో కోపానికి గురైన వైభవ్.. లంక ఆటగాడిని తోసేశాడు. ఈ సంఘటనపై స్పందించిన క్లైవ్ లాయిడ్.. వైభవ్ ధీటుగా స్పందించడం కంటే అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

రిఫరీలు, అంపైర్లు ఉంటారు:

‘ఆటలో అలాంటి సందర్భాల కోసం మ్యాచ్ రిఫరీలు, అంపైర్లు ఉంటారు. ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వెంటనే రిఫరీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. క్రికెట్ నిబంధనల్లో ప్రత్యర్థిని రెచ్చగొట్టడం అనుమతించబడదు. కాబట్టి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థితో ఘర్షణ పడకుండా అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది’ అని క్లైవ్ లాయిడ్ పేర్కొన్నాడు. వైభవ్ ప్రస్తుతం భారత క్రికెట్‌లో యువ ప్రతిభగా గుర్తింపు పొందుతున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలతో 776 పరుగులు చేసిన అతడు.. త్వరలో ఐర్లాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు అరంగేట్రం చేసే అవకాశముంది. అతడి దూకుడు ఆటతీరు అభిమానులను ఆకట్టుకుంటున్నప్పటికీ.. మైదానంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా అంతే ముఖ్యమని క్లైవ్ లాయిడ్ సూచించాడు.