Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!

Vaibhav Sooryavanshi Fearless Reply

Vaibhav Sooryavanshi Fearless Reply

Vaibhav Sooryavanshi Fearless Reply Goes Viral: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత క్రికెట్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్‌’ను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొని.. భారీ షాట్లు ఆడటం అతడి ప్రత్యేకతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో బుడ్డోడు ఏకంగా టీమిండియాలోనే చోటు దక్కించుకున్నాడు.

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ:

ఇంగ్లండ్ పర్యటనలో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో విఫలమవడంతో చివరి టీ20లో జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం జరిగిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో రెచ్చిపోయాడు. మొదటి టీ20లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో 50), రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 20), మూడో టీ20లో తుఫాన్ ఇన్నింగ్స్‌ (49 బంతుల్లో 81 పరుగులు) ఆడాడు. మూడు మ్యాచ్‌లలో 151 రన్స్ చేశాడు. బుడ్డోడి అద్భుత బ్యాటింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా దక్కింది.

ఏ బౌలర్‌కు భయపడలేదు:

తాజాగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) షేర్ చేసిన ఓ వీడియోలో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ సరదా నిర్వహించిన ఇంటర్వ్యూలో ‘ఏ బౌలర్‌ను ఎదుర్కోవడానికి భయపడతావు?’ అని వైభవ్‌ను ప్రశ్నించారు. దీనికి అతడు ఏమాత్రం ఆలోచించకుండా ‘ఇప్పటివరకు ఏ బౌలర్‌కు భయపడలేదు’ అంటూ ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమాధానం అతని ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. చిన్న వయసులోనే అతడి ఆత్మవిశ్వాసాన్ని చూసి క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్‌:

వైభవ్‌కు మరో పెద్ద గౌరవం దక్కింది. వచ్చే నెల ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ కోసం ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెడ్ బాల్ జోనల్ టోర్నీలో తొలి అవకాశంలోనే ఉప కెప్టెన్ బాధ్యతలు దక్కడం అతడిపై సెలెక్టర్లకు ఉన్న నమ్మకాన్ని చాటుతోంది. అన్ని ఫార్మాట్లలో భారత భవిష్యత్ స్టార్‌గా అతడిని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈస్ట్ జోన్ జట్టులో బిహార్ నుంచి ఎంపికైన ఏకైక ఆటగాడు కూడా సూర్యవంశీనే. ఈ జట్టులో మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దులీప్ ట్రోఫీ జరగనుంది.