Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!

  • భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య మ్యాచ్‌
  • మరోసారి వార్తల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
  • థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి
Vaibhav Sooryavanshi Out

Vaibhav Sooryavanshi Out

Vaibhav Sooryavanshi Not Out Controversy in INDA vs AFGA: ట్రై సిరీస్ 2026లో భాగంగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని బ్యాటింగ్ కంటే.. థర్డ్ అంపైర్ ఇచ్చిన ‘నాట్ అవుట్’ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. రీప్లేలు చూసిన చాలా మంది అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా అది స్పష్టమైన క్యాచ్ అని భావించగా.. థర్డ్ అంపైర్ మాత్రం వైభవ్‌ను నాట్ అవుట్‌గా ప్రకటించాడు.

క్యాచ్ పట్టినా అవుట్ కాదు:

వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాట్ ఆడగా.. అఫ్గానిస్థాన్-ఎ ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. వైభవ్ కూడా తాను అవుట్ అయ్యానని భావించి.. బౌండరీ లైన్ దాటి డ్రెస్సింగ్‌రూమ్ వైపు వెళ్ళాడు. అయితే క్యాచ్ విషయంలో అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సాయం కోరాడు. పలు కోణాల్లో రీప్లేలు పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్.. బంతి కొంత భాగం నేలను తాకినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. దాంతో సూర్యవంశీ నాటౌట్ అని తేల్చాడు. వెంటనే వైభవ్ తిరిగి క్రీజులోకి వచ్చాడు.

×
×
Ad

అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ఆటగాళ్ల అసంతృప్తి:

థర్డ్ అంపైర్ నిర్ణయం అఫ్గానిస్థాన్ ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. క్యాచ్ స్పష్టంగా పట్టినట్లే కనిపిస్తోందని భావించిన అఫ్గాన్ ప్లేయర్స్.. ఫీల్డ్ అంపైర్ల వద్దకు వెళ్లి వివరణ కోరారు. బంతి కొంత భాగం నేలను తాకిందనే కారణంతోనే థర్డ్ అంపైర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. దాంతో అఫ్గాన్ ప్లేయర్స్ నిరాశ వ్యక్తం చేస్తూ.. ఫీల్డింగ్ కోసం వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. చాలామంది అభిమానులు థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు చేశారు. మరికొందరు మాత్రం వీడియోలో స్పష్టత లేకపోవడంతో బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చారని అంటునారు.

రెండు లైప్స్ లభించినా:

ఈ వివాదాస్పద నిర్ణయంతో వైభవ్ సూర్యవంశీకి కీలక లైఫ్ లభించింది. అప్పటికి అతను ఖాతా కూడా తెరవలేదు. ఆ తర్వాత ఇంకో జీవనాధారం దక్కింది. మ్యాచ్‌లో మొత్తంగా రెండు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని బుడ్డోడు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 38 పరుగులు చేసిన అనంతరం ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్‌లో షాట్ ఆడి ఖాలిద్ తనీవాల్‌కు సులభ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

వైభవ్‌పై భారీ అంచనాలు:

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ధాటిగా ఎదుర్కోవడంతో.. అతడి ప్రతి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాడితో జరిగిన ఘర్షణ కారణంగా కూడా వైభవ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు థర్డ్ అంపైర్ వివాదం మరోసారి అతడిని చర్చనీయాంశంగా మార్చింది.