Vaibhav Sooryavanshi Gets Special BCCI Permission: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. ఇప్పుడు మరో ప్రత్యేక సౌకర్యంను పొందాడు. వైభవ్ ఇంకా మైనర్ కావడంతో విదేశీ పర్యటనల సమయంలో తల్లిదండ్రులు అతడితో పాటు ప్రయాణించేలా బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
సాధారణంగా భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు బీసీసీఐ అనుమతి ఇవ్వదు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాలే కావడంతో.. ఈ విషయంలో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘వైభవ్ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టుతో శ్రీలంకలో ఉన్నాడు. అతడు ఇంకా చిన్నవాడు, మైనర్ కూడా. సీనియర్ జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లంతా పెద్దవాళ్లు కావడంతో అతడు సౌకర్యంగా ఉండేందుకు కుటుంబ సభ్యులు వెంట ఉండటం మంచిదని భావిస్తున్నాం. అందుకే అతడి తల్లిదండ్రులను కూడా పర్యటనలకు రావాలని కోరుతున్నాం’ అని సైకియా తెలిపారు.
శ్రీలంక పర్యటన తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు కూడా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు వెళ్లాలనుకుంటే బీసీసీఐ పూర్తి సహకారం అందిస్తుందని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కొత్త వాతావరణం, సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండే పరిస్థితులకు అలవాటు పడేందుకు కొంత సమయం అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘ఇది ప్రతి ఆటగాడికి ఇచ్చే అవకాశం కాదు. కానీ వైభవ్ వయసును దృష్టిలో ఉంచుకుని అతడు మానసికంగా, భావోద్వేగంగా సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే వెయ్యికి పైగా పరుగులు చేసి తన ప్రతిభను నిరూపించాడు. ముఖ్యంగా పవర్ హిట్టింగ్, ఒత్తిడి పరిస్థితుల్లో ఆడే తీరు అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. భారత టీ20 జట్టులో ఓపెనర్ స్థానానికి అతడు బలమైన అభ్యర్థిగా మారడంతో సెలెక్టర్లు అతడిని జాతీయ జట్టులోకి తీసుకువచ్చారు. వైభవ్ ఎంపికపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. మీడియాతో మాట్లాడుతూ అతడు తన ప్రదర్శనలతోనే జట్టులో చోటు సంపాదించుకున్నాడని పేర్కొన్నాడు. బుడ్డోడి ప్రతిభపై ఇప్పటికే భారత క్రికెట్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అతడి భారీ షాట్లు, నిర్భయమైన బ్యాటింగ్, మ్యాచ్‌ను మార్చగల సామర్థ్యం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. రాబోయే ఐర్లాండ్ సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్న ఈ యువ సంచలనం.. భారత క్రికెట్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాడు.

