Vaibhav Sooryavanshi Debut Seems nlikely: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడా? అనే ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంశంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతులైన కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. ఇప్పటికే జట్టుకు పరుగులు చేస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు అన్యాయం చేయడం కూడా సరికాదని స్పష్టం చేశారు.
ఇతరులకు అన్యాయం చేయలేము:
ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరంతా ఇటీవల టీ20ల్లో మంచి ప్రదర్శనలు కనబరిచిన ఆటగాళ్లే. ఈ పరిస్థితిలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించాలంటే వారిలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సితాంశు కోటక్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కానీ ఇప్పటికే బాగా ఆడుతున్న ఆటగాళ్లను పక్కన పెట్టి కేవలం కొత్తవారికి అవకాశం ఇవ్వడం సరైంది కాదు. అవకాశం ఇవ్వడం, మరో ఆటగాడికి అన్యాయం చేయడం మధ్య చాలా చిన్న గీత మాత్రమే ఉంటుంది’ అని అన్నారు.
అరంగేట్రంపై ఇప్పుడే చెప్పడం కష్టం:
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోటక్ వెల్లడించారు. జట్టు కూర్పుపై సాయంత్రం సమావేశంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘వైభవ్ ఈరోజే అరంగేట్రం చేస్తాడా? లేదా తర్వాతి మ్యాచ్‌లోనా? ఇప్పుడే చెప్పడం కష్టం. సమావేశం తర్వాతే తుది నిర్ణయం తెలుస్తుంది’ అని తెలిపారు. అయితే వైభవ్ ప్రతిభపై కోటక్ ప్రశంసలు కురిపించారు. అండర్-19 జట్టులో అతడితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని, అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని అన్నారు. ‘వైభవ్‌కు నేను, గౌతమ్ గంభీర్ ఒకటే చెప్పాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఉండమని. ఇది నీ జట్టే అని భావించాలని సూచించాం. ఏదైనా చెప్పాలనిపిస్తే సంకోచించకుండా చెప్పమని ప్రోత్సహించాం’ అని కోటక్ వెల్లడించారు.
జట్టులో కెప్టెన్ ఒక్కడే నాయకుడు కాదు:
ఇక టీ20 జట్టుకు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై కూడా కోటక్ ప్రశంసలు వ్యక్తం చేశారు. ఐపీఎల్, ముంబై జట్టు తరఫున కెప్టెన్సీ చేసిన అనుభవం అయ్యర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ‘జట్టులో కెప్టెన్ ఒక్కడే నాయకుడు కాదు. సీనియర్ ఆటగాళ్లంతా నాయకత్వ బాధ్యతలను పంచుకుంటారు. కేకేఆర్‌లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు శ్రేయస్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించాడు. అతడికి నాయకత్వంలో మంచి అనుభవం ఉంది’ అని చెప్పారు. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? లేక అనుభవజ్ఞులకే ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఇప్పుడు టీమిండియా ప్రకటించే తుది జట్టుపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం మాత్రం యువ సంచలనం అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

