Site icon NTV Telugu

Yash Dhul: రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన అండర్‌-19 క్రికెట్ కెప్టెన్

ఇటీవల యువ భారత్ అండర్-19 ప్రపంచకప్‌ గెలవడంలో కెప్టెన్ యశ్ ధుల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతడు రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యశ్ ధుల్ సెంచరీతో కదం తొక్కడం విశేషం. గౌహతి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి యశ్ ధుల్ సెంచరీతో రాణించాడు. మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 18 బౌండరీలు ఉన్నాయి.

ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో యశ్ ధుల్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. తొలి రంజీ మ్యాచ్‌లోనే శతకంతో రాణించడం మాములు విషయం కాదని.. అతడు టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ అవుతాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ కూడా యశ్ ధుల్‌ను అభినందించింది. ఐపీఎల్‌లో యశ్ ధుల్‌ను ఇటీవల జరిగిన మెగా వేలంలో రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా తీవ్ర జాప్యం జరిగిన దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీ గురువారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు వేదికల్లో లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

Exit mobile version