Site icon NTV Telugu

T20 World Cup: మెగా టోర్నీని వెంటాడుతున్న వరుణుడు.. మరో మ్యాచ్ వాష్ అవుట్..!!

T20 World Cup 2022

T20 World Cup 2022

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే గ్రూప్-2లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తాజాగా గ్రూప్-1లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో రెండు మ్యాచ్‌లు చేరాయి. ఇప్పటివరకు టోర్నీలో సూపర్-12 దశలో ఏ జట్టు కూడా రెండు విజయాలు సాధించలేదు. వరుణుడు మాత్రం రెండు మ్యాచ్‌లను వాష్ అవుట్ చేశాడు.

Read Also: ICC Rankings: పాకిస్థాన్‌తో ఒక్క ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

అసలే గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణిస్తున్న గ్రూప్-1లో ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్‌కు పరాజయం ఎదురైందంటే దానికి కారణం కూడా వరుణుడే. మొత్తానికి టీ20 ప్రపంచకప్‌లో అనేక మ్యాచ్‌ల ఫలితాలను వరుణుడు ఒంటిచేత్తో మార్చేస్తున్నాడు. దీంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రస్తుతానికి మూడు పాయింట్లతో న్యూజిలాండ్ గ్రూప్ టాపర్‌గా కొనసాగుతోంది. రెండు పాయింట్లతో శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వరుస స్థానాలను ఆక్రమించాయి. ఆప్ఘనిస్తాన్ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరెదెవరో చెప్పడం కష్టంగానే మారిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version