ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ చాలా తప్పిదాలు చేసింది. బ్యాటింగ్ విభాగమైతే పూర్తిగా విఫలమైంది. పుజారా, రిషభ్ పంత్ పుణ్యమా అని.. కాస్తో కూస్తో స్కోరు వచ్చింది. మిగిలిన వాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఫీల్డింగ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. సరైన పొజిషన్‌లో ఫీల్డర్స్ పెట్టకపోవడం, మిస్ ఫీల్డ్స్ చేయడం మైనస్ పాయింట్స్. హనుమ విహారి అయితే అత్యంత కీలకమైన క్యాచ్‌ని మిస్ చేయడం, ఈ మ్యాచ్‌కే పెద్ద ప్రతికూలతగా మారింది. అదే.. జానీ బెయిర్ స్టో.
బెయిర్ స్టో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ స్థానంలో హనుమ విహారి ఉన్నాడు. ఆ క్యాచ్ ఏమీ అత్యంత క్లిష్టమైంది కాదు, తానున్న ప్లేస్‌కే వచ్చింది. అది కూడా చేతుల్లోకి! అలాంటి చేతికి అందివచ్చిన క్యాచ్‌ని విహారి జారవిడిచాడు. బంతి తనవైపుకు దూసుకురావడంతో, ఎక్కడ తనకు తగులుతుందోనన్న భయంతో కిందకు వంగాడు. దీంతో, క్యాచ్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. తద్వారా బంతి అతని చేతులకు తాకి, ఫోర్ దిశగా దూసుకెళ్లింది. అలా తనకు లైఫ్ రావడంతో.. బెయిర్ స్టో చెలరేగిపోయాడు. జో రూట్‌తో కలిసి సెంచరీ చేసి, మ్యాచ్‌కి హీరోగా నిలిచాడు.
చాలా సింపుల్ క్యాచ్‌ని కూడా విహారి మిస్ చేయడంతో.. నెటిజన్లు అతడ్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేశాడని, ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకుని ఉండుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ క్యాచ్ పట్టడానికి కూడా చేతకానప్పుడు, ఎందుకు ఆడుతున్నావ్ అంటూ మరికొందరు ఏకిపారేస్తున్నారు. బహుశా ఆ క్యాచ్ విహారి పట్టి ఉంటే, ఫలితంగా మరోలా ఉండేదేమో!