Site icon NTV Telugu

IPL 2022: ఐపీఎల్‌లో అతి తక్కువ ఎకానమీ కలిగిన టాప్-5 బౌలర్లు వీరే..!!

సాధారణంగా పొట్టి క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు బౌలర్లను చితకబాది పరుగుల మీద పరుగులు చేస్తుంటారు. దీంతో బౌలర్ల గణాంకాలు దారుణంగా నమోదవుతుంటాయి. ఒక రకంగా బౌలర్‌కు టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటారు. బౌలర్లు ఓవర్‌కు 10కి పైగా పరుగులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి.

అయితే ఐపీఎల్‌లో బెస్ట్ ఎకాన‌మీతో అత్యంత త‌క్కువ ప‌రుగులు ఇచ్చిన బౌలర్లు కూడా ఉన్నారు. కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన వారిలో అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్ చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రషీద్‌ఖాన్ మాత్రమే. ఈ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఐపీఎల్‌లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో మొత్తం 76 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్ ఖాన్ కేవ‌లం 6.33 ఎకాన‌మీ కలిగి ఉన్నాడు. అంటే ఓవర్‌కు ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడన్నమాట. పొట్టి ఫార్మాట్‌లో ఆరు ఎకానమీ రేట్ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీలంక బౌలర్ మురళీధరన్ ఉన్నాడు. అతడు 6.67 ఎకానమీతో మాత్రమే పరుగులు సమర్పించుకున్నాడు. మురళీధరన్ ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌లు ఆడి 63 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ ఉన్నాడు. నరైన్ 6.72 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అతడు 135 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు సాధించాడు. నాలుగో స్థానంలో టీమిండియా బౌలర్ అశ్విన్ ఉన్నాడు. అతడు 167 మ్యాచ్‌లు ఆడి 6.91 ఎకానమీతో 145 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ఉన్నాడు. 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 6.91 ఎకానమీతో 97 వికెట్లు సాధించాడు.

Exit mobile version