Site icon NTV Telugu

మన బోణీ అదిరేనా? నేడే అప్ఘనిస్తాన్‌తో భారత్ ఢీ

టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్‌తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడైనా షాక్ ఇవ్వగలదు.

Read Also: ఆ ఓటమే ఇండియాను దెబ్బతీసింది : గవాస్కర్

మరోవైపు జట్టు కూర్పు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతిపెద్ద సమస్యగా మారింది. టీమ్‌లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఉన్నా ఎందుకో అతడిని తుదిజట్టులో ఆడించడంలేదు. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వరుణ్ చక్రవర్తిపై టీమ్ మేనేజ్‌మెంట్ అతి విశ్వాసం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ అతి విశ్వాసమే తొలి రెండు మ్యాచ్‌ల్లో దెబ్బ తీసిందనేది విశ్లేషకుల మాట. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్ల ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ భారత్ గెలిస్తే పెద్దగా సంబరాలు ఉండకపోవచ్చు కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కోహ్లీపై విమర్శల దాడి తప్పదు.

పిచ్ ఎలా ఉంటుంది?
టీ20 ప్రపంచకప్‌లో అబుదాబి పిచ్ మీద ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా… అందులో ఆరు సార్లు ఛేజింగ్ టీమ్ గెలిచింది. ఇక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కొంత అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ వివరించాడు.

Exit mobile version