పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (సీఏపీ) అండర్-19 హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్‌పై దాడి జరిగింది. సోమవారం ముగ్గురు స్థానిక క్రికెటర్లు కోచ్‌పై దాడి చేశారు. దాడిలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజేష్ ధ్రువీకరించారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నుంచి ఆటగాళ్లను తొలగించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పుదుచ్చేరి స్థానిక క్రికెటర్లకు దేశీయ మ్యాచ్‌లలో సీఏపీ అధికారులు తగిన అవకాశాలను ఇవ్వడం లేదు. నకిలీ జనన, విద్య ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ చిరునామాలతో బయటి క్రికెటర్లను స్థానికులుగా ఆడిస్తున్నారు. 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు స్థానిక ప్లేయర్స్ మాత్రమే పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో అవకాశం ఇవ్వకపోవడంతో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు వెంకటరామన్‌పై బ్యాట్‌తో దాడి చేశారు. ఈ దాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ.. ‘పాండిచ్చేరి కోచ్‌పై దాడి జరిగినట్లు తెలిసింది. బీసీసీఐ త్వరలో దర్యాప్తు చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
తనపై జరిగిన దాడిపై కోచ్ వెంకటరామన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘డిసెంబర్ 8న, ఉదయం 11 గంటలకు నేను సీఏపీ క్యాంపస్‌లో ఇండోర్ నెట్స్‌లో ఉన్నాను. పాండిచ్చేరి సీనియర్ క్రికెటర్లు కార్తికేయన్ జయసుందరం, ఎ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమరన్ వచ్చి నాతో దుర్భాషలాడడం ప్రారంభించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదని వాగ్వాదం పెట్టుకున్నారు. అరవిందరాజ్ నన్ను పట్టుకున్నాడు. కార్తికేయన్, సంతోష్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. జట్టులో అవకాశం రావాలంటే తనను కొట్టమని భారతీదాసన్ పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జి. చంద్రన్ చెప్పాడని వారు నాతో చెప్పారు’ అని ఫిర్యాదులో కోచ్ వెంకటరామన్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్పందించడానికి సీఏపీ నిరాకరించింది.
