NTV Telugu Site icon

IND Vs NZ: వణికించిన బ్రేస్‌వెల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం

Team India Win

Team India Win

IND Vs NZ:  హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 337 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ టీమిండియాను వణికించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేసిన అతడు 140 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్లలో సిరాజ్ మరోసారి అదరగొట్టాడు. సిరాజ్ తన హోంగ్రౌండ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు సాధించారు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

Read Also: India: జనాభాలో ఇక ఇండియా ఫస్ట్ ప్లేస్.. చైనాను మించినట్లు అంచనా..

అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లను శుభ్‌మన్ గిల్ చితక్కొట్టాడు. అయితే ఎప్పటిలాగే టాప్ ఆర్డర్ వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు టెయింలెండర్ల వికెట్లను తీయడంలో తడబడ్డారు. బ్రేస్‌వెల్, శాంట్నర్ ఏడో వికెట్‌కు సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.