NTV Telugu Site icon

ICC T20 Rankings: కప్పు పోయింది.. ర్యాంకు మిగిలింది

Team India

Team India

ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో షాక్ తగిలింది. ఫైనల్‌కు వెళ్లి చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొని కప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ (264), పాకిస్థాన్ (258), దక్షిణాఫ్రికా (256), న్యూజిలాండ్ (253) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. దీంతో కప్ పోయినా.. ర్యాంకు మిగిలిందంటూ నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. వరల్డ్ కప్ సాధించకుండా ర్యాంకులు సాధించి ఏం ఉపయోగం అంటూ ప్రశ్నిస్తున్నారు.

అటు టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), డెవాన్ కాన్వే(న్యూజిలాండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), ఆడిన్ మార్‌క్రమ్ (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో టాప్-10లో ఒక్క టీమిండియా బౌలర్ కూడా లేడు. హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆప్ఘనిస్తాన్), హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా), షాంసీ (దక్షిణాఫ్రికా), జంపా (ఆస్ట్రేలియా) టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మహ్మద్ నబీ (ఆప్ఘనిస్తాన్) టాప్-2లో కొనసాగుతున్నారు.

Read Also: Virat Kohli: కప్పు చల్ గయా.. రికార్డులు మాత్రం ఆగయా..!!

మరోవైపు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో టీ20 సిరీస్‌కు హార్దిక్, వన్డే సిరీస్‌కు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ టూర్‌కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ మరోసారి భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.