NTV Telugu Site icon

సౌతాఫ్రికా పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : బీసీసీఐ

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ లో తలపడుతున్న భారత జట్టు… అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అక్కడ సౌతాఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పర్యటన పై కరోనా నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఈ మధ్యనే సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ ను కనుగొన్న విషయం తెలిసిందే. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం అక్కడ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ వాయిదా పడింది. దాంతో భారత పర్యటన కూడా వాయిదా పడుతుందా.. అనే అనుమానాలు వచ్చాయి.

కానీ తాజాగా ఈ విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పదించారు. ఆయన మాట్లాడుతూ… ఇంకా సౌతాఫ్రికా టూర్ పై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. కానీ మేము సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో నిరంతరం మాట్లాడుతున్నాము. అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నాము. దీనిపై వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు. ఇక ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 17 న ప్రారంభం కావాల్సి ఉంది.