విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికాకు సిరీస్ సొంతం అవుతుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా ఒత్తిడికి గురవుతోంది. సత్తా ఉన్న కుర్రాళ్లు జట్టులో ఉన్నా.. కీలక సమయంలో వాళ్లందరూ చేతులెత్తేస్తున్నారు. అనుభవలేమి జట్టులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా లాంటి ఐపీఎల్ కెప్టెన్‌లు జట్టులో ఉన్నారు. అయినా వరుసగా రెండు టీ20ల్లో ఓటమి పాలయ్యారు. మరి పంత్ సేన ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలా పోరాడుతుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
గత 14 టీ20ల్లో దక్షిణాఫ్రికా 13 విజయాలు సాధించింది. అందులోనూ ఛేదనలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఆ జట్టును ఓడించడం మన కుర్రాళ్లకు కష్టమైన పనే. టీ20ల్లో సొంతగడ్డపై చివరగా 2018-19లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఏడు సిరీస్‌లలో విజయం సాధించింది. విశాఖలో పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా సహకరిస్తుందని భావిస్తున్నారు. గతంలో ఈ స్టేడియంలో రెండు టీ20 మ్యాచ్‌లు జరగ్గా ఛేదన చేసిన జట్లే గెలిచాయి. ఒక మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్.. మరో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించాయి.
