NTV Telugu Site icon

IND Vs NZ: ఉప్పల్ వన్డేలో గిల్ డబుల్.. టీమిండియా జిగేల్

Team India

Team India

IND Vs NZ: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభాన్నిచ్చారు. అయితే 13వ ఓవర్‌లో రోహిత్‌ను టిక్నర్ ఔట్ చేయడంతో మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆపై కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్యా (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) విఫలమైనా.. గిల్ మాత్రం ఒంటరి పోరాటంతో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు.

Read Also: Vijay Zol: అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్

ఓవైపు వికెట్లు పడుతున్నా గొప్ప పోరాట స్ఫూర్తితో కివీస్ బౌలర్లపై గిల్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే 87 బంతుల్లోనే కెరీర్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై జోరు పెంచిన గిల్ 145 బాల్స్‌లో కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేసి అతిపిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజుల్లో) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక మొత్తంగా టీమిండియా తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌ గిల్. గతంలో సచిన్ ,సెహ్వాగ్, రోహిత్, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీలు చేశారు. అలాగే న్యూజిలాండ్ జట్టుపై ఓ టీమిండియా బ్యాటర్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. సచిన్ (186 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును గిల్ తిరగరాశాడు.