Site icon NTV Telugu

T20 World Cup: టీమిండియాతో లుంగీ డ్యాన్స్ చేయించిన ఎంగిడి.. ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్

South Africa

South Africa

T20 World Cup: పెర్త్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెచ్చిపోయింది. తన పేస్ అటాక్‌ను టీమిండియాకు రుచిచూపించింది. దీంతో భారత బ్యాటర్లు అల్లాడిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహం అయిపోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 9 పరుగులకే అతడు అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. అతడు 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా డకౌట్ అయ్యాడు.

Read Also: IND Vs SA: వరుసగా మూడోసారి టాస్ మనదే.. అక్షర్ పటేల్ అవుట్

ముఖ్యంగా దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియా టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. అతడు నాలుగు వికెట్లతో తన సత్తా చూపించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 40 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు చేయడంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (2), దినేష్ కార్తీక్ (6), అశ్విన్ (7) కూడా రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3 వికెట్లతో చెలరేగిపోయారు. షమీ రనౌట్ అయ్యాడు. నోర్జ్‌కు ఒక వికెట్ దక్కింది.

Exit mobile version