NTV Telugu Site icon

Team India Record: పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

Team India Record

Team India Record

Team India Record: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్‌ల్లో గెలిచిన పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ జట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. తాజాగా వెస్టిండీస్‌పై వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకుని టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాకిస్థాన్ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. 2007-22 మధ్య విండీస్‌పై భారత్ వరుసగా 12 వన్డే సిరీస్‌లు సొంతం చేసుకోగా.. 1996-2021 మధ్య జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుంది. ఈ జాబితాలో మూడో స్థానంలోనూ పాకిస్థానే ఉంది. 1999-2022 మధ్య విండీస్‌పై వరుసగా 10 సిరీస్‌లను పాకిస్థాన్ జట్టు గెలుచుకుంది. 1995-2018 మధ్య జింబాబ్వేపై దక్షిణాఫ్రికా 9 సిరీస్‌లను, 2007-2021 మధ్య శ్రీలంకపై భారత్ 9 సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి.

Read Also: IND Vs WI: దుమ్మురేపిన అక్షర్ పటేల్.. వన్డే సిరీస్ టీమిండియా కైవసం

కాగా వెస్టిండీస్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది జట్టు సమష్టి కృషి వల్ల సాధ్యమైందని పేర్కొన్నాడు. ఇలాంటి ఫలితాలు సాధించడానికి ఐపీఎల్ ముఖ్య కారణమని ధావన్ అభిప్రాయపడ్డాడు.రెండో వన్డేలో మిడిలార్డర్ అద్భుతంగా రాణించిందని కితాబిచ్చాడు. ఈ మ్యాచ్‌లో తాము తప్పిదాలు చేసినా మిడిలార్డర్ కృషి వల్ల అవి మరుగున పడిపోయాయని తెలిపాడు. అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ ఒత్తిడికి గురికాకుండా విజయతీరాలకు చేర్చడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ధావన్ చెప్పాడు.

Show comments