Team India: బుధవారం నాడు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ నగరంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరింది. ఈరోజు ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన సభ్యులు సాయంత్రం వచ్చారు. టీమిండియా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీమిండియా క్రికెటర్ల కోసం అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నగరంలోని పార్క్ హయత్ హోటల్‌కు తరలించారు.
Read Also: Delhi MLA’s : ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
కాగా ఈనెల 18న బుధవారం నాడు తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో రేపు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది. న్యూజిలాండ్ జట్టు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుని ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. సోమవారం నాడు న్యూజిలాండ్ క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొని తీవ్ర కసరత్తులు చేశారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి తాము మెగా టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు రెండు జట్లు తహతహలాడుతున్నాయి. తాజాగా స్వదేశంలో శ్రీలంకపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.