టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈనెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫేస్ షీల్డులు, ఫేస్ మాస్కులతో దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా తమ దేశానికి చేరుకున్న తరువాత భారత క్రికెట్ జట్టు కఠినమైన నిర్బంధంలో నివసించాల్సిన అవసరం లేదని ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Also: BWF టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా… రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా… మూడో టెస్ట్ జనవరి 11 నుంచి 15 వరకు కేప్‌టౌప్ వేదికగా జరగనున్నాయి. ఈనెల 19 నుంచి సెంచూరియన్ వేదికగా భారత జట్టు ప్రాక్టీస్ ప్రారంభించనుంది. మరోవైపు సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా ముంబై ఎయిర్‌పోర్ట్ చేరుకోగా.. విరాట్ తన కూతురు ఫొటో తీయవద్దని ఫొటోగ్రాఫర్లను కోరాడు. కానీ చాలామంది ఫొటోగ్రాఫర్లు వామిక ఫొటోలను క్లిక్ చేశారు. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
