Site icon NTV Telugu

Team India: పంత్‌ను ఎలా కొనసాగిస్తారు? శాంసన్ బలిపశువా?

Sanju Samson

Sanju Samson

Team India: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షార్పణం అయినా ఈ వన్డేలో టీమిండియా జట్టు ఎంపిక పలు విమర్శలకు తావిచ్చింది. తొలి వన్డేలో 36 పరుగులతో రాణించిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియాను దెబ్బతీసిందని.. అందుకే రెండో వన్డేలో దీపక్ హుడాను తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వివరణ ఇచ్చాడు. అయితే పదే పదే విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో దీపక్ హుడాకు చోటు ఇవ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఎవరు ఆడకపోయినా టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం సంజూనే బలిపశువును చేస్తోందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Ram Charan: వాలెంటైన్స్ డేకి మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందా?

నిలకడగా రాణిస్తున్న సంజు శాంసన్‌కు సరిపడా అవకాశాలు ఇవ్వకుండా అతడి కెరీర్ నాశనం చేస్తున్నారని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఎంత చెత్తగా ఆడుతున్నా రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను కొనసాగిస్తున్నారని, వాళ్లకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో సంజూ చక్కగా రాణించాడని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అయినా అతడికి టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదని.. చివరకు తొలి వన్డేలో ఒకే ఒక అవకాశం ఇచ్చారని.. తొలి మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన సంజు శాంసన్.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడని అంటున్నారు. అతడు రాణించినా.. విఫలమైనా ఏదో ఒక చెత్త కారణం చూపించి జట్టులో నుంచి తీసివేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version