Site icon NTV Telugu

Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్‌ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్

Virat Kohli

Virat Kohli

Asia Cup 2022: రేపటి నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ సమరం ప్రారంభం కాబోతోంది. టోర్నీలో రెండో రోజే హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు దుబాయ్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిక్షణ సెషన్‌లు నిర్వహిస్తుండగా.. భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు కలుసుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. ఒకవైపు ఇరుదేశాల అభిమానులు ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతుంటే.. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం కూల్‌గా కనిపిస్తూ ముచ్చట్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతోంది. ఇటీవల బాబర్ ఆజమ్‌, విరాట్ కోహ్లీ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిదిని చాహల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కలిసి పరామర్శించారు. ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. గాయపడ్డ షాహిన్ షా అఫ్రిది త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ఆకాంక్షించారు.

Read Also: Pakistan: “నేషనల్ ఎమర్జెన్సీ” ప్రకటించిన పాక్

కాగా ఈ వీడియోలో స్టార్ క్రికెటర్ల మధ్య పరస్పర సంభాషణలను చూసి కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో భారత టాపార్డర్‌ను పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది కుప్పకూల్చడం, తర్వాత బాబర్ ఆజామ్, రిజ్వాన్ చెలరేగడంతో భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవాల్సి ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది దూరమవ్వడంతో బౌలింగ్ ఎటాక్‌ను భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్ లీడ్ చేయనుండగా.. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను హరీస్ రౌఫ్ లీడ్ చేయనున్నాడు.

Exit mobile version