Site icon NTV Telugu

Team India: కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా.. కోహ్లీకి పగ్గాలు ఇవ్వాలని డిమాండ్

Rohit Sharma

Rohit Sharma

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో రోహిత్‌కు వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం ట్వీట్‌ చేసింది. దీంతో జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ దూరం కానున్నాడు. అటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు బుమ్రాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 35ఏళ్ల తర్వాత భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించనున్నాడు. గతంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్ ఒక్కడే టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

రోహిత్ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం టీమ్ బస చేస్తున్న హోటల్‌లోనే ప్రత్యేకంగా అతడు క్వారంటైన్‌లో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. అయితే రోహిత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ సారథ్యంలోనే భారత్ నాలుగు టెస్టులలో 2-1తో నిలిచిందని, రీ షెడ్యూల్ అయిన చివరి టెస్ట్‌లో కూడా అతని సారథ్యంలోనే బరిలోకి దిగాలని అభిమానులు కోరుతున్నారు. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌కైనా కోహ్లీని కెప్టెన్‌ చేయాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే విరాట్ కోహ్లీనే కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version