Site icon NTV Telugu

టీమిండియాకు బ్యాడ్ న్యూస్… గాయంతో బుమ్రా అవుట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు.

Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?

అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ అతడిని మైదానం బయటకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆ ఓవర్‌లో మిగిలి ఉన్న బంతిని మహ్మద్ సిరాజ్ పూర్తి చేశాడు. బుమ్రా మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. అయితే బుమ్రా గాయం తీవ్రత ఎంత మేరకు ఉందో తెలియరాలేదు. స్కానింగ్ పరీక్షల అనంతరం త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. బుమ్రా, సిరాజ్, షమీ, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగగా.. బుమ్రా గాయంతో మైదానం వీడటంతో ఇప్పుడు టీమిండియాకు నలుగురు బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా… డీన్ ఎల్గార్ (1) వికెట్‌ను బుట్టలో వేసుకున్నాడు.

Exit mobile version