Site icon NTV Telugu

IND Vs SA: కేఎల్ రాహుల్ స్థానంలో పంత్.. టీమిండియా కోచ్ క్లారిటీ

Rishab Pant

Rishab Pant

IND Vs SA: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. టీమిండియా మంచి ప్రదర్శనే చేస్తున్నా ఓపెనర్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడనున్న మ్యాచ్‌లో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ సామర్థ్యంపై నమ్మకం పోదని స్పష్టం చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు బాగా ఆడినట్లు గుర్తుచేశాడు. అందుకే రాహుల్ స్థానంలో ఇంకొకరి గురించి ఆలోచించడం లేదని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.

Read Also: NZ Vs SL: ఫిలిప్స్ వీరవిహారం.. టీ20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ

కాగా ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ సేన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్పిన్నర్ చాహల్ మరికొన్ని మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చిన రోహిత్ తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. అటు విరాట్ కోహ్లీ కూడా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తే దక్షిణాఫ్రికా జట్టుకు కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు వర్షం కారణంగా జింబాబ్వేతో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీ టీమ్.. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే భారత్‌పై ఎలాగైనా గెలిచి సెమీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది.

Exit mobile version