Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్‌తో మాత్రం’.. వాచ్‌మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్

Jemimah

Jemimah

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఉండే క్రేజ్, ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మైదానంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కళ్లన్నీ ఆ మ్యాచ్‌పైనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి హైవోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న 2026 మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. భారత మహిళల జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడటం విశేషం. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరగబోయే ఈ హై-ప్రెజర్ మ్యాచ్ గురించి భారత స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఆటగాళ్లపై ఉండే ప్రత్యేకమైన ఒత్తిడి గురించి జెమిమా స్పందిస్తూ.. ఈ మ్యాచ్ మిగిలిన మ్యాచ్‌ల్లాంటిది కాదని, దీనిపై అభిమానులకు ఉండే అంచనాలు, వచ్చే ఒత్తిడి పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. తాను మొదటిసారి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడినప్పుడు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన స్పీచ్‌ను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘భారత్-పాక్ మ్యాచ్ చరిత్ర ఏంటో మనకు తెలుసు, బయట నుంచి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాబట్టి ఆ ఒత్తిడిని మనం కాదనలేం’ అని హర్మన్‌ప్రీత్ తమకు ధైర్యం చెప్పినట్లు జెమిమా తెలిపారు.

×
×
Ad

ఇదే విషయమై జెమిమా ఒక సరదా ఉదాహరణను పంచుకుంటూ.. ‘చివరికి మా బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా నాతో ‘మీరు ఎవరి చేతిలోనైనా ఓడిపోండి కానీ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు’ అని అంటుంటాడు. ప్రజలు క్రికెట్‌ను, ఈ రెండు దేశాల మధ్య ఉండే పోటీని అంతలా ప్రేమిస్తారు. అందుకే ఆ స్థాయి ఒత్తిడి ఉంటుంది’ అని చెప్పారు.

గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని, అందుకే ఈ టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ టైటిల్ గెలిచే బలమైన జట్టుగా బరిలోకి దిగుతోందని జెమిమా ధీమా వ్యక్తం చేశారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, టోర్నమెంట్లు ఎలా గెలవాలి అనే విషయంపై జట్టులోని ఆటగాళ్లందరికీ ఇప్పుడు పూర్తి అవగాహన, నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో కలిసి ఉంది. ఈ గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.