NTV Telugu Site icon

టీమిండియాపై ఇంకా ఆగని ట్రోల్స్‌…

క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్‌కు ఈ ఇద్దరు విలవిలలాడారు. ఒత్తిడికి చిత్తయిన ఈ జోడీ ఆరంభంలోనే వికెట్లను పారేసుకొని వెనుదిరిగారు. దాంతో ఈ ఇద్దరిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ వడపావ్ తినాలని ఒకరంటే.. నట్టేట ముంచేసాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదని, తన ఆటతో తీవ్రంగా హర్ట్ అయ్యామని కామెంట్ చేస్తున్నారు.

ఇక కోహ్లీ సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంతో భారత్ గట్టెక్కిందని అంతా భావించారు. కాని జట్టుకు భారీ స్కోరును అందించలేకపోయారు. ఇక బౌలర్ల సంగతి చెప్పనవసరం లేదు. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయకుండా పాకిస్థాన్‌ ఓపెనర్ల ముందు తేలిపోయారు.

ఉదయం గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేసినప్పుడే మ్యాచ్‌ ఓడిపోతుందని డౌట్‌ వచ్చిందన్నారు అభిమానులు. గంభీర్‌ ట్వీట్‌పై మీమ్స్‌ పేల్చారు. ఇక ఫస్ట్‌ మ్యాచ్‌ ఓడిపోతేనే కప్‌ కొడతామంటూ కవర్‌ చేస్తూ మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు దృశ్యం గుర్తు చేస్తూ మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌ జరగలేదని.. ఎవరడిగినా అదే చెప్పాలంటూ వెంకీ మామా డైలాగ్‌తో టీమిండియాకు చురకలంటించారు.

బయటే కాదు.. స్టేడియం లోపల కూడా అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా అభిమానులను స్టేడియంలోనే ఆటపట్టించారు పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌. ఇండియా ఓడిపోయిందని మొహం మీద పదే పదే చెప్పడంతో స్టేడియంలో టీమిండియా సపోర్టర్స్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.