Rohit Sharma Speech in Wankhede: భారత అభిమానులకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. భారత్‌కు తిరిగివచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉందని, అభిమానుల మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుందన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టం అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు వెళ్లారు.
విశ్వవిజేతలకు ముంబైలో అభిమానులు ఘన స్వాగతం పలకారు. ఓపెన్ టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. టీమిండియా ప్లేయర్స్ కప్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులకు అభివాదం చేశారు. ఇక వాంఖడే మైదానంలో భారత ఆటగాళ్లకు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. ముందుగా ప్రకటించిన విధంగా రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్‌ను జట్టుకు అందజేసింది. ఈ కార్యక్రమం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. వాంఖడేలో రోహిత్ ప్రసంగం ప్రారంభించగానే.. అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ‘అందరికీ థ్యాంక్స్’ అని హిట్‌మ్యాన్ అన్నాడు.
Also Read: Rohit Sharma: టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా ఎవరికి చెప్పాడో తెలుసా?
‘భారత్‌కు వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది. మాకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులను చూస్తే.. ఈ టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం మాలాగే మీరు కూడా ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైంది. ఈ ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుంది. జట్టుతో కలిసి ప్రధాని మోడీని కలవడం ఎంతో గౌరవంగా ఉంది. ప్రపంచకప్‌ను సెలబ్రేట్ చేయడంలో ముంబై ఎప్పటికీ నిరాశపరచదు. మాకు ఘనస్వాగతం దక్కింది. మాతో పాటు ట్రోఫీ కోసం ఎదరుచూసిన అభిమానులకు, దేశానికి.. టీమిండియా, బీసీసీఐ తరఫున ధన్యవాదాలు. ఈ జట్టు ఎంతో స్పెషల్. జట్టుకు సారథ్యం వహించడం నా అదృష్టం. అందరూ బాగా ఆడారు. ఫైనల్‌లో హార్దిక్ ఫైనల్ ఓవర్‌ను బాగా బౌలింగ్ వేశాడు. హార్దిక్‌కు పెద్ద హ్యాట్సాఫ్’ అని రోహిత్ పేర్కొన్నాడు.