NTV Telugu Site icon

Mohammed Siraj: నేడు హైదరాబాద్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ రోడ్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Mohammed Siraj

Mohammed Siraj

Mohammed Siraj Road Show in Hyderabad Today: టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా గురువారం (జులై 4) స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడి.. స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా.. ‘వన్స్‌ ఇన్‌ ఎ లైఫ్‌ టైమ్‌ మూవ్‌మెంట్‌’ను ఆస్వాదించింది. భారత విజయోత్సవ ర్యాలీకి అరేబియా తీరం జన సంద్రమైంది. అభిమానులు తమ క్రికెటర్లపై పూల వర్షం కురిపిస్తూ.. భారత్‌ మాతాకీ జై, జయహో భారత్‌, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు.

విజయయాత్ర అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోగా.. వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా కూడా ఫ్యాన్స్‌ స్టేడియంలోనే ఉండి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భారత జట్టు స్లేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు మొత్తం స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ఇక టీ20 ప్రపంచకప్‌ గెలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను అందించింది.

Also Read: Virat Kohli: ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది: విరాట్ కోహ్లీ

భారత జట్టు విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్‌ సిరాజ్ ఈరోజు తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి భాగ్యనగర అభిమానులు సిద్ధమయ్యారు. గురువారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్‌లో రీక్రియేట్ చేస్తున్నాం. జులై 5న సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో మొదలవుతుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కలుద్దాం’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.