NTV Telugu Site icon

IND vs CAN: నేడు కెనడాతో భారత్‌ ఢీ.. కళ్లన్నీ అతడిపైనే!

Ind Vs Can Preview

Ind Vs Can Preview

India vs Canada Preview and Playing 11: టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు కెనడాను భారత్‌ ఢీకొట్టనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. భారీ విజయంతో ఘనంగా గ్రూప్‌ దశను ముగించి.. సూపర్‌-8కు మరింత జోష్‌తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన సూపర్‌ 8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించాలి భారత్ భావిస్తోంది. మరోవైపు పటిష్ట రోహిత్ సేనకు కనీస పోటీని ఇవ్వాలని కెనడా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్‌.. హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఐర్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాకిస్థాన్, అమెరికాతో మ్యాచ్‌ల్లో శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్‌ దూబే ఆకట్టుకున్నారు. అయితే ఆందోళనంతా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనే. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న విరాట్‌.. వరుసగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌ 2024లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 5 పరుగులే చేశాడు. కెనడాతో మ్యాచ్‌లో అయినా అతడు పుంజుకోవాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ప్రస్తుతం అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి.

ఒకవేళ కెనడా మ్యాచ్‌ కోసం బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తే.. యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అప్పుడు విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడనుండగా.. శివమ్‌ దూబేకు చోటు ఉండదు. ఇక బౌలింగ్‌లో భారత్ పటిష్ఠంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా పేస్‌తో హడలెత్తిస్తున్నారు. అయితే మొహమ్మద్ సిరాజ్‌ ప్రభావం చూపలేకపోతుండటం కాస్త కలవరపరిచే అంశం. ఈ మ్యాచ్‌తో అయినా గాడిలో పడితే.. టీమిండియాకు ఏ ఇబ్బంది ఉండదు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, ఆర్ జడేజా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌లో ఒకరిని ఆడించే అవకాశాలు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్, జడేజా/కుల్దీప్, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌.
కెనడా: ఆరోన్, నవ్‌నీత్, పర్గత్, నికోలస్, శ్రేయస్, రవిందర్‌పాల్, సాద్‌ బిన్‌ జాఫర్‌ (కెప్టెన్‌), దిలాన్, ఖలీమ్‌ సాన, జునైద్, గోర్డాన్‌.