NTV Telugu Site icon

Virat Kohli: ముందుండి అసలు పండగ.. కాస్త ఓపిగ్గా ఆడు విరాట్: సన్నీ

Virat Kohli Form

Virat Kohli Form

Sunil Gavaskar on ఐపీఎల్ Virat Kohli Form: 2024లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. పదిహేను రోజులు తిరిగేసరికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. దీంతో విరాట్ ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్‌ఏ పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై వికెట్‌ను సమర్పిస్తున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓపెనర్‌గా రావడం కూడా విరాట్ ఆటతీరుపై ప్రభావం చూపి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. విరాట్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, టీ20 ప్రపంచకప్‌లో మున్ముందు మ్యాచ్‌లలో కీలకమవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ కాస్త ఓపిగ్గా ఆడితే తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడన్నాడు. అమెరికా మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ… ‘దేశం కోసం ఆడేటప్పుడు వరుసగా మ్యాచ్‌లను గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి. భారత్‌ జట్టుకు గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలను అందించాడు. ఆ విషయం తప్పకుండా అతడికి గుర్తుండే ఉంటుంది’ అని అన్నాడు.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో రెచ్చిపోయాడు.. ప్రపంచకప్‌లో తేలిపోయాడు! కోహ్లీకి ఏమైంది?

‘మనం టీ20 ప్రపంచకప్‌లో తొలి దశలోనే ఉన్నాం. సూపర్ 8, సెమీస్, ఫైనల్‌ ఉన్నాయి. అసలు సమరం ముందే ఉంది. విరాట్ కోహ్లీ కాస్త ఓపికగా ఆడితే తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడు. అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరు చేసినంత మాత్రాన.. ఒక బ్యాటర్ సరిగా ఆడలేదని కాదు. కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మంచి బంతులను ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరుతుంటారు. అందుకే విరాట్ గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. అతడిపై నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలనేది అతడికి బాగా తెలుసు. విరాట్ పరుగులు చేస్తాడు’ అని సన్నీ ధీమా వ్యక్తం చేశాడు.