NTV Telugu Site icon

South Africa vs West Indies: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్‌ ఇంటికి! ఇక మిగిలింది గ్రూప్‌1

South Africa, West Indies

South Africa, West Indies

South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్‌-8 గ్రూప్‌ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్‌ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్‌ఏ, వెస్టిండీస్‌) ఇంటిదారి పట్టాయి. సూపర్‌-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లలో గెలిచింది. ఇక గ్రూప్‌1 సెమీస్‌ జట్లేవో తేలాల్సి ఉంది. ఇవాళ జరిగే భారత్‌-ఆస్ట్రేలియా, అఫ్గాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లతో ఫలితం తేలనుంది.

సెమీస్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విండీస్‌ చివరివరకూ పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. విండీస్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రొటీస్ ఇబ్బంది పడింది. ఛేదన ఆరంభమైన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించి.. టార్గెట్‌ను 124 పరుగులుగా నిర్దేశించారు. చివరికి 16.1 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి సఫారీలు విజయం సాధించారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు డికాక్ (12), హెడ్రిక్స్ (0) అవుట్ అయినా.. ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22) జట్టును ఆదుకున్నారు. జాన్సెన్ (21 నాటౌట్), మార్‌క్రమ్ (18) రాణించారు. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరం కాగా.. రబాడ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లు తీశాడు.

Also Read: Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్‌ (52) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కేల్ మయేర్స్‌ (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హోప్ (0), పూరన్ (1), పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0) నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసీ 3 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన షంసీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.